ఐసీసీపై ట్రంప్ ఆంక్షలు
![ఐసీసీపై ట్రంప్ ఆంక్షలు](https://www.bipjobs.com/uploads/images/202502/image_750x_67a5b04b4dd52.jpg)
రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. వివిధ దేశాలపై సుంకాలను వడ్డిస్తూ వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. తాజాగా, అంతర్జాతీయ నేర న్యాయస్థానాన్ని (ఐసీసీ) ఆయన వదలిపెట్టలేదు. తమతో పాటు మిత్రదేశం ఇజ్రాయేల్ ‘చట్టవిరుద్ధమైన, నిరాధారమైన’ దర్యాప్తు చేశారని ఆగ్రహిస్తూ ఆయన ఐసీసీపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు ట్రంప్ ఎగ్జిక్యూటీవ్ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటన నేపథ్యంలో ట్రంప్ ఈ చర్యకు దిగడం గమనార్హం. ట్రంప్, నెతన్యాహు మంగళవారం శ్వేతసౌధంలో సమావేశమయ్యారు. అనంతరం క్యాపిటల్ హిల్లో చట్టసభ సభ్యులతో ఇజ్రాయేల్ ప్రధాని భేటీ అయి.. వివిధ అంశాలపై చర్చలు జరిపారు.
![](https://vaartha.com/wp-content/uploads/2025/02/%E0%B0%85%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF-%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BF%E0%B0%A8%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%AA%E0%B1%88-%E0%B0%86%E0%B0%82%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A7%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%AA%E0%B1%8D1.webp)
అక్టోబరు 7 నాటి హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై చేపట్టిన సైనిక చర్యలో ఇజ్రాయేల్ యుద్ధ నేరాలకు పాల్పడ్డారని బెంజమిన్ నెతన్యాహుకు గత ఏడాది నవంబరులో ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇజ్రాయెల్ సైన్యం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని మండిపడింది.
ఈ క్రమంలో ఐసీసీపై గుర్రుగా ఉన్న ట్రంప్.. గురువారం ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ‘అంతర్జాతీయ నేర న్యాయస్థానం.. మా సన్నిహిత మిత్రదేశం ఇజ్రాయేల్ను లక్ష్యంగా చేసుకుని చట్టవిరుద్ధమైన, నిరాధారమైన చర్యలకు పాల్పడింది’ అని ఆరోపించారు. ఆ దేశ ప్రధాని నెతన్యాహు, ఆయన మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్పై నిరాధారమైన అరెస్టు వారెంట్లు జారీచేసి.. అధికారాన్ని దుర్వినియోగం చేసిందని ఆగ్రహించారు. అమెరికా, ఇజ్రాయేల్ ఐసీసీకి ఎలాంటి అధికార పరిధి లేదని తేల్చిచెప్పారు. ఇరు దేశాలపై చర్యలతో ఐసీసీ ప్రమాదకరమైన ఉదాహరణను సృష్టించిందని దుయ్యబట్టారు. దీనిపై హేగ్‌లోని అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఇంకా స్పందించలేదు.
What's Your Reaction?
![like](https://www.bipjobs.com/assets/img/reactions/like.png)
![dislike](https://www.bipjobs.com/assets/img/reactions/dislike.png)
![love](https://www.bipjobs.com/assets/img/reactions/love.png)
![funny](https://www.bipjobs.com/assets/img/reactions/funny.png)
![angry](https://www.bipjobs.com/assets/img/reactions/angry.png)
![sad](https://www.bipjobs.com/assets/img/reactions/sad.png)
![wow](https://www.bipjobs.com/assets/img/reactions/wow.png)