ప్రైవేట్ ఆస్తులపై నిషేధం సరైనదేనా? హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

వెంకట సుబ్బయ్య అనే రైతు హైకోర్టును ఆశ్రయించాడు. మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో తనకు సంబంధించి 1.26 ఎకరాల స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చడంపై ఈ పిటిషన్‌ను జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టగా, పిటిషనర్ తరపున కటిక రవీందర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ ఈ భూమిని సాదాబైనామా కింద కొనుగోలు చేసుకుని 1992లో క్రమబద్ధీకరించుకున్నాడని, ప్రభుత్వం ద్వారా పెట్టుబడి రాయితీ ప్రోత్సాహకాలను కూడా పొందాడని ధర్మాసనానికి వివరించారు. నిషేధిత జాబితాలో ప్రైవేటు ఆస్తులను చేర్చే అధికారం ప్రభుత్వానికి, అధికారులకు లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి చట్టం స్పష్టంగా ఉందని తెలిపింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22 ఏ మార్గదర్శకాలకు విరుద్దంగా తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు కావని తేల్చి చెప్పింది.
తన భూమిని విక్రయించేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు తదితరాలతో కలిపి చలానా కింద రూ.30.35 లక్షలు చెల్లించి, విక్రయం కోసం స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే బ్లాక్ చేశారన్నారు. జుల్ఫికర్ ఆలీఖాన్ అనే వ్యక్తి ఇచ్చిన వినతి ఆధారంగా సీసీఎల్ఏ రిజిస్ట్రేషన్ జరగకుండా ఉత్తర్వులు జారీ చేశారని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా చేయడం సహజ న్యాయ సూత్రాలకు, రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏలోని నిబంధనలకు విరుద్ధమని వివరించారు.ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి .. సెక్షన్ 22ఏలో పొందుపరచిన విభాగంలో లేని ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చే అధికారం ప్రభుత్వానికి, అధికారులకు లేదని చట్టం స్పష్టంగా చెబుతోందన్నారు. పిటిషనర్‌కు చెందిన పత్రాలను పరిశీలించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉత్తర్వుల ప్రతి అందిన నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
What's Your Reaction?






