కీలక వడ్డీ రేట్లపై 0.25 శాతం తగ్గింపు : ఆర్‌బీఐ
కీలక వడ్డీ రేట్లపై 0.25 శాతం తగ్గింపు : ఆర్‌బీఐ

న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్, రుణగ్రహీతలకు పెద్ద ఉపశమనాన్ని ప్రకటించింది. రెపో రేటును నాలుగో వంతు తగ్గించాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా రెపో రేటు 0.25% లేదా 25 బేసిస్ పాయింట్లు (25 bps) తగ్గింది. దీంతో, రెపో రేట్ ప్రస్తుతం ఉన్న 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గుతుంది. కేంద్ర బ్యాంకు నిర్ణయం వల్ల గృహ రుణాలు, కారు రుణాలు, విద్యా రుణాలు, కార్పొరేట్ రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడానికి బ్యాంకులకు మార్గం సుగమం అయింది. RBI MPC ఫలితాలను కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.
సంజయ్ మల్హోత్రా ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. బ్యాంకులు అకస్మాత్తుగా ఆర్‌బీఐ వద్ద పూచీకత్తు లేకుండా డిపాజిట్లు చేసినప్పుడు వాటిపై స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటును వసూలు చేస్తారు. ఎస్‌డీఎఫ్ రేటును 6 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటును 6.5 శాతంగా నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా చెప్పారు.
కరోనా సంక్షోభ కాలం (2020 మే) తర్వాత ఆర్‌బీఐ రెపోరేటును తగ్గించడం ఇదే తొలిసారి. 2020 మే నుంచి 2022 ఏప్రిల్ మధ్యకాలంలో ఆర్‌బీఐ రెపోరేటు స్థిరంగా 4 శాతంగా ఉంది. 2022 ఏప్రిల్ నుంచి 2023 ఫిబ్రవరి వరకు అది స్థిరంగా 6.5 శాతం వద్ద ఉంది. నాటి నుంచి ఈరోజు వరకు రెపోరేటును 6.5 శాతం వద్దే కొనసాగించారు.
What's Your Reaction?






